కెరీర్ బెస్ట్ మూవీ అంటున్న హెబ్బా పటేల్.. ‘మిరాకిల్’ విశేషాలివే!

Miracle

ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిరాకిల్’ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర మూడో షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని కొండమడుగులో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం స్థానిక ప్రజల సమక్షంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణధీర్ బీసు హీరోగా నటిస్తుండగా, హెబ్బా పటేల్ కథానాయికగా చేస్తోంది. సీనియర్ నటులు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో ‘మిరాకిల్’ ఒక గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ, దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ కథను వైవిధ్యంగా మలిచారని, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త ప్రయత్నాలను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు.

దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ, భారతీయ తెరపై ఇప్పటివరకు రాని సరికొత్త పాయింట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. షూటింగ్ నిర్వహణలో సహకరించిన కొండమడుగు గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే చివరి షెడ్యూల్ పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఈ చిత్రానికి ప్రభాస్ నిమ్మల దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. నరేష్ నాయుడు ఈ మూవీతో విలన్‌గా పరిచయమవుతున్నారు. ఆమని, టేస్టీ తేజ, ఝాన్సీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version