‘రాజుగారి గది’కి మరిన్ని కొత్త థియేటర్లు!

Raju-Gari-kadha
బుల్లితెరపై రియాలిటీ షోస్ హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్, ఆ తర్వాత ‘జీనియస్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జీనియస్ సినిమా సూపర్బ్ రిజల్ట్ ఇవ్వకపోయినా, ఓంకార్‌కి దర్శకుడిగా మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘జీనియస్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది’ అంటూ హర్రర్ కామెడీతో దసరా కానుకగా మనముందుకు వచ్చారు.

అక్టోబర్ 22వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్క్రీన్ కౌంట్‌తో విడుదలైన ఈ సినిమా, పేరుకు తగ్గట్టే మంచి హర్రర్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. కామెడీకి తెలుగులో మంచి ఆదరణ కనిపిస్తోన్న పరిస్థితుల్లో విడుదలైన ఈ హర్రర్ కామెడీకి అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ రాజుగారి గది యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తెలుగులో మంచి పేరున్న వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను విడుదల చేయడంతో ఈ పాజిటివ్ రిపోర్ట్‌తో సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటోంది.

ఇక ఈ నేపథ్యంలోనే రాజుగారి గదికి మరిన్ని థియేటర్లను నేటినుంచి కేటాయించారు. సినిమాను విడుదల చేసిన అనిల్ సుంకర ఇదే విషయాన్ని తెలియజేస్తూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని, కొత్తగా మరిన్ని థియేటర్లను జతచేసి సినిమాను ఎక్కువ మందికి చేర్చే ఆలోచన చేశామని తెలిపారు.

Exit mobile version