నవంబర్ ఫస్ట్‌వీక్‌లో నాగశౌర్య సినిమా ఆడియో!

abbayitho-ammayi
తెలుగు సినీ పరిశ్రమకు ఈమధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన యువహీరోల్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. ఇక తన గత చిత్రమైన ‘జాదూగాడు’తో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను ట్రై చేసిన ఈ హీరో, ప్రస్తుతం రెండు వరుస సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. నాగ శౌర్య హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా, రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న మరో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

‘అబ్బాయితో అమ్మాయి’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు యూత్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండడం విశేషం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను నవంబర్ నెల మొదటివారంలో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇళయరాజా ఈ వేడుకకు హాజరయ్యే సూచనలున్నాయని సమాచారం. ఇక సినిమాను కూడా త్వరలోనే రిలీజ్‌కు రెడీ చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

Exit mobile version