
రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్ అందుకొని ఫుల్ జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ‘చిన్నదాన నీకోసం’ అంటూ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్నాడు. ‘చిన్నదాన నీ కోసం’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నితిన్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ చెబుతున్నాడు.
ఈ సినిమా ఆడియోని నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ 27న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనున్న చిన్నదాన నీకోసం ఆడియోకి ముఖ్య అతిధిగా కింగ్ నాగార్జున హాజరై, ఆడియోని లాంచ్ చేయనున్నాడు. నాగార్జునతో పాటు అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా ఈ ఆడియో రిలీజ్ వేడుకకి హాజరు కానున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 19న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది.
కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుసగా మూడు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన తర్వాత నితిన్ – అసూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో కూడా వాటిని మించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.