ఎన్టీఆర్-నీల్ రిలీజ్ పై సరికొత్త చర్చ.. మరీ ఏడాది వెనక్కి ఎందుకు..?

NTRNeel

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ విడుదల వాయిదా పడటం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. తొలుత ఈ చిత్రాన్ని జూన్ 2026లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఈ మూవీని ఒక ఏడాది ఆలస్యంగా.. అంటే జూన్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. దీంతో అసలు ఈ సినిమా ఏకంగా ఏడాది కాలం ఎందుకు ఆలస్యం అయ్యిందా అని అందరూ ఆలోచిస్తున్నారు.

ఈ ఆలస్యానికి ప్రధానంగా ఎన్టీఆర్ మేకోవర్ మరియు స్క్రిప్ట్ పరంగా జరిగిన మార్పులే కారణమని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మొదట భారీగా బరువు తగ్గగా, ఆ లుక్ పట్ల అభిమానుల నుండి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ప్రశాంత్ నీల్ సూచన మేరకు ఎన్టీఆర్ మళ్ళీ కండలు పెంచి పవర్‌ఫుల్ లుక్‌లోకి మారడానికి కొన్ని నెలల సమయం తీసుకున్నాడు. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం స్క్రిప్ట్‌లోని కొన్ని కీలక సన్నివేశాలను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు రీ-వర్క్ చేశాడు. ఈ మార్పుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిత్రీకరించిన కొన్ని ఎపిసోడ్ల పట్ల ఎన్టీఆర్ మరియు నీల్ ఇద్దరూ పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో వాటిని రీ-షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా భారీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version