
హ్యాట్రిక్ హిట్స్‌తో తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న హీరో నిఖిల్ తాజాగా శంకరాభరణం సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉండగానే నిఖిల్ తన కొత్త సినిమాను మొదలుపెట్టేసి దూసుకుపోతున్నాడు. దసరా పర్వదినం సందర్భంగా నిఖిల్ హీరోగా నటించబోయే కొత్త సినిమా ఒకటి లాంచ్ అయింది. ‘టైగర్’ సినిమాతో మెప్పించిన దర్శకుడు వీఐ ఆనంద్, నిఖిల్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వర్రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నవంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. దర్శకుడు వీఐ ఆనంద్ తన మొదటి సినిమా మాదిరిగానే ఈ సినిమానూ ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘స్వామిరారా’ సినిమా దగ్గర్నుంచీ వరుసగా విభిన్న కథాంశాలను, విలక్షణ జానర్ సినిమాలను ఎంచుకుంటూ వెళుతోన్న నిఖిల్, ఈ సినిమా ద్వారా మరోకొత్త జానర్‌ను టచ్ చేస్తున్నారు. నిఖిల్-వీఐ ఆనంద్ దర్శకత్వంలో రానున్న సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. అదేవిధంగా ఈ సినిమాలో నిఖిల్ మార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.