నితిన్ చేతికి సూర్య ’24’ తెలుగు రైట్స్!

Nithin1
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమిళంలో అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ అదే స్థాయి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు చాలా సంస్థలు పెద్ద మొత్తంతో పోటీకి దిగాయి.

కాగా ఈ స్థాయి పోటీలో తెలుగు హీరో నితిన్ ’24’ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం విశేషంగా కనిపిస్తోంది. శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ ద్వారా నితిన్ ’24’ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ’24’ సినిమాతో ఓ సైన్స్ ఫిక్షన్‌ కథ ద్వారా అందరినీ ఆశ్చర్యపరచేందుకు సిద్ధం కానున్నారట. ఇప్పటివరకూ తమిళంలోనే ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చిన ఈ సినిమా, నితిన్ రాకతో తెలుగులోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందనడంలో సందేహం లేదు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సూర్య సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version