
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్షన్లో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకీ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో కరోనా లాక్ డౌన్ రావడంతో ఆగిపోయింది. ఏడు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఈమధ్యనే షూట్ మొదలైంది. చిత్ర బృందం ఔట్ డోర్ లొకేషన్లకు వెళ్లకుండా హైదరాబాద్లోనే సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు.
ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన టీమ్ రేపటి నుండి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇందులో కథలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. రేపు మొదలవ్వబోయే షెడ్యూల్ ఏకధాటిగా టాకీ పార్టీ పూర్తయ్యేవరకు జరుగుతుందట. మధ్యలో సంక్రాంతి పండుగ వస్తున్నా బ్రేక్ తీసుకోదల్చుకోలేదట వెంకీ అండ్ టీమ్. ఇప్పటికే ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో పండుగ సెలవులు తీసుకోవట్లేదట బృందం. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇప్పటీ విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సినిమా కూడ అనుకున్నట్టే వస్తున్నట్టు చెబుతున్నారు టీమ్. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. కథలో సోల్ మిస్సవకుండా తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేసి సినిమా చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది.