‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ ‘వార్ 2′. నిన్న రాత్రి ఈ సినిమా ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘దేవర’ విడుదలైనప్పుడు ఆ ఏడాది ‘దేవరనామ’ సంవత్సరమని చెప్పాను. ఇది హృతిక్రామారావు నామ సంవత్సరం. మెరుపు తీగల్లా ఉన్న ఇద్దరినీ ఒకే తెరపై చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అంతకుమించి ఉంటుందని దర్శకుడు అయాన్ చెబుతున్నారు. ఇక సాధారణ యాక్షన్ మూవీ అయితే, ఎన్టీఆర్ అవసరం లేదు. ఏ భావోద్వేగాన్నైనా పలికించగల నటుడు ఎన్టీఆర్’ అని త్రివిక్రమ్ తెలిపారు.
త్రివిక్రమ్ ఇంకా మాట్లాడుతూ.. ‘బంగారం ఉంటే నగ చేయించుకుంటారు కానీ, బీరువాలో పెట్టుకోరు కదా. ఎన్టీఆర్ కూడా బంగారంలాంటి వారే. ఏ నగ చేయాలో అయాన్‌కు తెలుసు. అందుకే ఎన్టీఆర్ కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఎన్టీఆర్, హృతిక్‌లు వింధ్య, హిమాలయ పర్వతాలలాంటివారు. ఈసారి వినాయక చవితి సంబరాల్లో ‘వార్2’ పాట వినపడుతూనే ఉంటుంది. ఆగస్టు 14న విడుదలయ్యే ‘వార్2’ అందరినీ అలరిస్తుంది’’ అని త్రివిక్రమ్ కామెంట్స్ చేశారు.
