
మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే! ఆ కోవలోనే సుకుమార్ తన సొంత బ్యానర్‌పై ‘కుమారి 21F’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న రాజ్ తరుణ్ హీరోగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా హిబ్బా పటేల్ హీరోయిన్గా నటించారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితం నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా టీజర్ లాంచ్ గురించి ఎన్టీఆర్‌ను సంప్రదించడానికంటే ముందే ఆయనే స్వయంగా టీజర్ రిలీజ్‌కు ముందుకు రావడం ఎన్టీఆర్ గారి మంచితనానికి నిదర్శనమని అన్నారు. తాము ఎంతో ఇష్టపడి తీసిన కుమారి 21 ఎఫ్ సినిమా ఒక మంచి టీమ్ వర్క్ అని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “సుకుమార్ సినిమా అంటే ఎప్పుడూ ఏదో కొత్తదనం ఉంటుంది. ఇప్పుడీ కుమారి 21 ఎఫ్ టీజర్ చూశాక కూడా ఆ ఫీల్ కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయడమనేది నాకు చాలా సంతోషకర విషయం. రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్, త్వరలోనే హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకోనున్న రాజ్ తరుణ్, సుకుమార్‌ల కలయికలో వస్తోన్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హిబ్బా పటేల్, దర్శకుడు సూర్యప్రతాప్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు.