ఎన్.టి.ఆర్ కత్తి రీమేక్ చేయట్లేదు.!

NTR
గత ఏడాది కమర్షియల్ డైరెక్టర్ మురుగదాస్, తమిళ సూపర్ స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించిన తమిళ సినిమా ‘కత్తి’. ఈ సినిమాలో రైతుల కోసం పోరాటం చేసే ఓ పవర్‍ఫుల్ సోషల్ మెసేజ్ ని చాలా కమర్షియల్ గా చెప్పారు. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ అయిన ఈ సినిమాని మొదటి నుంచి తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు పెద్ద హీరోలు ఆసక్తి కనబరిచారు. అయితే అవన్నీ చర్చల దశల్లోనే ఆగిపోయాయి కానీ తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాని రీమేక్ లో ఎన్.టి.ఆర్ నటిస్తాడని వార్తలు వచ్చాయి.

అంతే కాకుండా ‘బలుపు’, ‘పండగ చేస్కో’ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఎన్.టి.ఆర్ సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ అసలీ కత్తి రీమేక్ చేయడం లేదని, అలాగే ఆ సినిమాని రీమేక్ లో నటించే ఆలోచనలో లేడని తెలిపారు. దీంతో మళ్ళీ కత్తి సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రీమేక్ చేస్తారనే ఉద్దేశంతో డబ్బింగ్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Exit mobile version