క్యాన్సర్‌తో బాధపడుతోన్న చిన్నారిని కలవనున్న ఎన్టీఆర్

ntr-fan
చాలామంది హీరోలు తెరపైనే కాక నిజ జీవితంలోనూ హీరోలుగా నిలిచే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. తమ అభిమానుల కోరికలను తీర్చడానికి గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి తారలు వారిని కలిసి కొంతసేపు గడిపి వారిలో ధైర్యాన్ని నింపిన విషయం తెలిసిందే. ఇప్పుడీ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు. అభిమానులే తనకు దేవుళ్ళని చెప్పే యంగ్ టైగర్ ఎన్టీఅర్ ఒక అభిమాని కోరిక తీర్చడం కోసం సిద్ధమయ్యారు.

శ్రీనిధి అనే పేరుగల ఓ పదేళ్ళ పాప గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం శ్రీనిధి కూకట్‌పల్లిలోని రాందేవ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. క్యాన్సర్ చివరిదశకు చేరిందన్న విషయాన్ని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శ్రీనిధిని రక్షించడానికి హాస్పిటల్ వర్గాలు ఎన్ని విధాలా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే మేక్ ఎ విష్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆ చిన్నారి ఓ కోరికను బయటపెట్టింది. తాను ఎంతగానో ఇష్టపడే హీరో ఎన్టీఆర్‌ను కలవాలి అని ఉందని వెల్లడించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఎన్టీఆర్, ఆ చిన్నారిని కలిసేందుకు సిద్ధమయ్యారు.

నేడు రామ్‌దేవ్ హాస్పిటల్‌లో శ్రీనిధిని కలిసేందుకు ఎన్టీఆర్ ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన శ్రీనిధిని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు చేరుకోనున్నారు. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను కలిసిన తర్వాత శ్రీనిధికి ఆత్మస్థైర్యం పెరగాలని, క్యాన్సర్‌ను జయించి కోలుకోవాలని ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరూ కోరుకుంటున్నారు.

Exit mobile version