‘ఒక్క మనసు’.. జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా : నాగ శౌర్య

Naga-Shourya
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న హీరో నాగశౌర్య, ఈమధ్యే ‘జాదూగాడు’తో మాస్ అవతారం కూడా ఎత్తారు. ఇక ఆ సినిమా అనుకున్నంతగా మెప్పించకపోవడంతో, మళ్ళీ తనదైన స్టైల్లో ‘అబ్బాయితో అమ్మాయి’ పేరుతో ఓ లవ్ స్టోరీని రిలీజ్‌కు రెడీ చేసేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ శౌర్య తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం తాను చేస్తోన్నవన్నీ ప్రేమకథలే అనీ, అందులో ఒక్క మనసు అనే సినిమా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమాగా నిలుస్తుందని తెలిపారు.

‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఒక్క మనసు అనే సినిమా ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఒక్క మనసు ఒక మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ అని, అలాంటి సినిమాలో భాగమవ్వడం తన అదృష్టమని నాగ శౌర్య ఈ సందర్భంగా తెలిపారు. “రామరాజు గారిని కలిశాక నా జీవితం కొత్తగా కనిపిస్తోంది. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ‘ఒక్క మనసు’ జీవితాంతం గుర్తుంచుకునే సినిమా” అన్నారు. ‘ఒక్క మనసు’ సినిమాను టీవీ 9 సంస్థతో కలిసి మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version