
బుల్లితెరపై రియాలిటీ షోస్ హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్, ఆ తర్వాత ‘జీనియస్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జీనియస్ సినిమా సూపర్బ్ రిజల్ట్ ఇవ్వకపోయినా, ఓంకార్‌కి దర్శకుడిగా మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘జీనియస్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది’ అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వస్తున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమా విడుదలవుతోంది.
ఇక వినాయక చవితి రోజు విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై ఓ ఆసక్తి రేగగా, తెలుగులో మంచి పేరున్న వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడంతో రాజుగారి గది సినిమా క్రేజీగా మారిపోయింది. ఇక ఈ దసరాకు వస్తోన్న మూడు వేటికవే భిన్నమైన సినిమాల్లో రాజుగారి గది కూడా ఒక ప్రత్యేకత సంతరించుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమాకున్న పాజిటివ్ బజ్కు కారణమైన వారాహి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకరలకు దర్శకుడు ఓంకార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన రాజుగరి గది సినిమా తనకు ఓ మంచి కమర్షియల్ సక్సెస్ తెచ్చిపెడుతుందని ఓంకార్ ఆశాభావం వ్యక్తం చేశారు.