తులునాడు ప్రాంతంలో విశేషంగా పూజలందుకునే దైవం ‘కొరగజ్జ’ ఆధారంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం త్వరలో 3D ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ పతాకాలపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం సలహా మేరకు, సినిమా విజువల్స్ మరింత అద్భుతంగా ఉండేందుకు 2D నుంచి 3Dకి మారుస్తూ విడుదలను వాయిదా వేశారు.
ప్రస్తుతం 40 మంది నిపుణుల బృందం ఈ 3D మార్పులపై పనిచేస్తోంది. సినిమాకు మరింత సహజత్వం తీసుకురావడానికి క్లైమాక్స్‌ను కేరళలోని మోహన్‌లాల్‌కు చెందిన ‘విస్మయ’ స్టూడియోలో ప్రత్యేకంగా నీటి అడుగున చిత్రీకరించారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పిళ్ళై నాలుగు కెమెరాలను ఉపయోగించి ఈ అండర్‌వాటర్ సన్నివేశాలను షూట్ చేశారు.
ఈ సినిమాలో నటి శృతి చేసిన సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. డూప్ లేకుండా 30 అడుగుల పైనుంచి ఆమె నీటిలోకి దూకి, 22 సెకన్ల పాటు ఆక్సిజన్ సహాయం లేకుండా నటించారు. దీనికోసం శృతి 15 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నారు. కాగా, విజువల్స్ అప్‌గ్రేడ్ చేయడం, కేవలం ఈ అండర్‌వాటర్ సన్నివేశాన్ని రీషూట్ చేయడం వల్ల బడ్జెట్ అదనంగా రూ.12 కోట్లు పెరిగిందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత విద్యాధర్ శెట్టి తెలిపారు.
