సినిమాల్లో పవర్ స్టార్‌గా అశేష అభిమానాన్ని పొందుతున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల తరపున పోరాడటమే తమ ఎజెండా అని చెబుతూ గత ఎన్నికల సమయంలో ‘జనసేన’ పేరుతో పవన్ ఓ రాజకీయ పార్టీని నెలకొల్పారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చిన పవన్, ఆ క్రమంలో పలుమార్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు సైతం గుప్పించారు.
ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ఓటుకు నోటు వ్యవహారంపై మాత్రం పవన్ నోరు విప్పలేదు. ఈ విషయంపై ఆయనపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ విమర్షలన్నింటికీ తెరదించుతూ నేడు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాజా రాజకీయ పరిణామాలపై పవన్ రెండు ప్రభుత్వాలను తన స్టైల్లో ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ విషయంపై తానేమీ మాట్లాడదల్చుకోలేదని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇక ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్టు చేత యాదాద్రి ప్లాన్‌ను రూపొందించడం వంటి చర్యలతో కేసీఆర్ సమైక్యతకు తెరతీశారని, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. అయితే కేసీఆర్ టీంలోని కొందరు మంత్రులు ఇంకా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అది మానుకోవాలని హితవు పలికారు. సెక్షన్ 8కు తాను విరుద్ధమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో పవన్ ఆంధ్రప్రదేష్‌కు చెందిన ఎంపీలను తీవ్ర స్థాయిలో విమర్షించడం విశేషం!
