
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే ఎంతో ఆసక్తికరంగా కనిపించిన ఈ సినిమా, ఇప్పుడు చివరిదశకు చేరి మరో నెలరోజుల్లో విడుదలకు సిద్ధమయ్యేసరికల్లా విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా టీజర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి.
ఈ అంచనాలన్నీ ఒక ఎత్తైతే ‘బ్రూస్‌లీ’ సినిమాను ఓ ప్రత్యేక విశేషం మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళింది. అదే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయనుండడం. ఇక ఇప్పుడు ఈ విశేషానికి మరో అదనపు విశేషంగా కూడా చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్రూస్‌లీ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నారనే వార్త ప్రస్తుతం అంతటా హల్‌చల్ చేస్తోంది.
కాగా ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే అభిమానులు మాత్రం రామ్ చరణ్ సినిమా, చిరంజీవి గెస్ట్ రోల్, పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్.. ఇలా ఈ కాంబినేషనే వర్కవుట్ అయితే కచ్చితంగా పండగే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. బ్రూస్‌లీలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.