
ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు థియేటర్లలో వాలిపోతాయి. అదే సినిమా ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉండి ఉంటే పోస్టర్, టీజర్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ అభిమానులకు పండగను డబుల్ చేస్తుంటారు మన హీరోలు. ఇక జాతీయ పండుగ అయిన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ రోజు సినిమాల జోరు ఓ రేంజ్లో ఉంటుంది. ఇక రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానూ ఈ జోరు కనిపించనుంది.
జాతీయ పండుగ రోజున అభిమానుల పండుగను డబుల్ చేసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా ‘సర్దార్’ ఫస్ట్‌లుక్‌తో మన ముందుకు రానున్నాడు. పవర్ సినిమా దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ మొదలైన రోజే ఓ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా, అందులో పవన్ కనిపించలేదు. ఇక రేపు పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉండనుందనేదే రివీల్ చేయనున్నారు. దీంతో అభిమానులు కూడా ఈ ఫస్ట్‌లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్‌పై ఎగ్జైటింగ్‌గా ఉన్నానని తెలిపారు.