పెద్ది : బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ సెన్సేషన్.. ఏకంగా రూ.400 కోట్ల మార్క్ క్రాస్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, కోస్తా ఆంధ్ర రీజియన్‌లో ఇప్పటికీ అద్భుతమైన అక్యుపెన్సీలతో దూసుకుపోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మైలురాయి దాటేసింది.

ప్రస్తుతానికి మరే ఇతర పెద్ద సినిమాలు రేసులో లేకపోవడంతో, 2026 సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘పెద్ది’ ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, మూడో వారం లోకి అడుగుపెడుతున్న ‘పెద్ది’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ వీకెండ్‌లో టాలీవుడ్‌లో ఏకంగా ఆరు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సమంత ‘మా ఇంటి బంగారం’తో పాటు కాక్‌టెయిల్ 2, దీవానా, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, వంద దేవుళ్లు, మరియు బాలన్: ది బాయ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ వరుస రిలీజ్‌ల కారణంగా రామ్ చరణ్ సినిమాకు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది.

ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ‘మా ఇంటి బంగారం’, ‘కాక్‌టెయిల్ 2’ చిత్రాలు ఎక్కువ స్క్రీన్లను ఆక్రమించనున్నాయి. థియేటర్లు మరియు స్క్రీన్ కౌంట్ తగ్గుతున్న నేపథ్యంలో, ఈ ఆరు చిత్రాల పోటీని తట్టుకుని మెగాపవర్ స్టార్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన వసూళ్ల ప్రభంజనాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి.

Exit mobile version