టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోలందరి సరసన నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వెలిగిపోయింది పూజా హెగ్డే. అయితే, ఆ తర్వాత వరుస పరాజయాలు రావడం, అలాగే ఆమె డిమాండ్లు కూడా ఎక్కువవడంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కనబెట్టారు. దీంతో గత రెండేళ్లుగా ఈ బుట్టబొమ్మ తెలుగులో ఒక్క కొత్త సినిమాపై కూడా సంతకం చేయలేక పోయింది. దాంతో ఆమె తన పూర్తి దృష్టిని, ఆశలను హిందీ ప్రాజెక్ట్‌లపైనే పెట్టుకుంది.
పూజా హెగ్డే ఆశలన్నీ వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బాలీవుడ్లో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె గట్టిగా నమ్మింది. అయితే, థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. వీకెండ్లో పెద్దగా ప్రభావం చూపించని ఈ సినిమా, వీక్‌డేస్‌లో మరీ దారుణమైన వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలింది. ఈ ఫలితం పూజా హెగ్డేకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. తెలుగులో మంచి విజయాలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసిన మృణాల్‌కు హిందీలో మాత్రం ఆశించిన బ్రేక్ రావడం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో కాస్త వెనుకబడి ఉంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలవడం అటు పూజా హెగ్డేకు, ఇటు మృణాల్ ఠాకూర్‌కు ఇద్దరికీ కోలుకోలేని గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.
