విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘బత్తా’ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది. దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడంతో విడుదలకి ముందే మూవీ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. తెలుగులో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల థియేటర్ల కొరత కారణంగా డబ్బింగ్ వెర్షన్‌ను తీసుకురాలేకపోయినప్పటికీ, హైదరాబాద్‌లోనూ ఒరిజినల్ వెర్షన్‌కు కొన్ని షోలు కేటాయించారు.
80ల నాటి నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక ముఠా కారణంగా పాడుబడిన స్కూల్ బాత్‌రూమ్‌లో దాక్కున్న రౌడీ ‘బత్తా’కి, అక్కడే ఇరుక్కుపోయిన శబరీ అనే చిన్న పిల్లాడికి మధ్య ఏర్పడే అనుకోని స్నేహం, సున్నితమైన ఎమోషన్స్ ప్రధానాంశంగా సాగుతాయి. దర్శకుడు బాలాజీ తరణీధరన్ రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు భిన్నంగా మానవ సంబంధాల ఆధారంగా ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అక్కడక్కడా కొంత నెమ్మదించినా, విజయ్ సేతుపతి మార్క్ పర్ఫార్మెన్స్, సాయి అభ్యంక్కర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంతో పాటు పెద్ద ప్లస్‌గా నిలిచాయి.
భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకపోయినా, సాంకేతికంగా మంచి ప్రతిభతో ఒక మంచి ఫీల్ గుడ్ వాచ్‌గా నిలిచిన ‘బత్తా’, తమిళంలో ‘మండాడి’ తర్వాత మరో ఘన విజయాన్ని సాధించే దిశగా పయనిస్తోంది. త్వరలోనే ఈ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంది.
