
సూపర్ హిట్ హారర్ కామెడీ ‘ముని’ ఫ్రాంచైజ్ సిరీస్ లో వస్తున్న మూడవ సినిమా ‘గంగ’. ముని 3 అనేది ఉపశీర్షిక. తాప్సీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం చెన్నైలో గ్రాఫిక్(సిజి) వర్క్స్ జరుగుతున్నాయి. జనవరి నెలాఖరు కల్లా ఈ పనులు పూర్తవుతాయి.
మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమాలో కొన్ని పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలో ఈ పాటలను ఇండోర్ సెట్స్ లో చిత్రీకరించనున్నారు. హారర్ – కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐదుగురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత.