బాలీవుడ్ స్టార్స్‌తో ‘ఫౌజీ’ వార్.. డామినేట్ చేస్తాడా..?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు ఒక అధికారిక స్పష్టత వచ్చింది. గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న రకరకాల ఊహాగానాలకు చెక్ పెడుతూ ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

అయితే, ఈ విడుదల తేదీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఒక భారీ బాక్సాఫీస్ యుద్ధానికి తెరలేపింది. డిసెంబర్ 3న ‘ఫౌజీ’ థియేటర్లలోకి వస్తుండగా.. మరుసటి రోజే, అంటే డిసెంబర్ 4న ఇద్దరు స్టార్ హీరోల బాలీవుడ్ చిత్రాలు పోటీకి సిద్ధమయ్యాయి. అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, తమన్నా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘రేంజర్’తో పాటు, అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ కూడా అదే వీకెండ్‌ను టార్గెట్ చేశాయి.

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇది భారీ క్లాష్‌గా మారనుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉంటుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో కీలకమైన పాన్-ఇండియా చిత్రం కావడంతో ‘ఫౌజీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి బాలీవుడ్ స్టార్స్‌తో ప్రభాస్ చేయబోయే వార్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.

Exit mobile version