‘పురుష:’ చిత్రం నుంచి వైష్ణవి ఫస్ట్ లుక్ విడుదల

Purusha 1

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా, వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రచార చిత్రాలతో ఆసక్తి రేపుతున్న చిత్ర బృందం, తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

భార్యాభర్తల మధ్య ఉండే ఘర్షణను ప్రతిబింబించేలా ఈ పోస్టర్ రూపొందించారు. ఇందులో ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అనే డైలాగ్ సినిమాలోని డ్రామాను సూచిస్తోంది. పోస్టర్లో వైష్ణవి సీరియస్‌ లుక్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో వైష్ణవి, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన కసిరెడ్డి, సప్తగిరి పోస్టర్లకు మంచి స్పందన లభించింది. వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్ వంటి ప్రముఖ హాస్య నటులు ఇందులో అలరించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version