పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాను కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. మే 22న ఈ చిత్రం దాదాపు 300 థియేటర్లలో విడుదల కానుంది. ఒకరోజు ముందుగా, మే 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత కోటేశ్వరరావు మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
నటుడు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే తన కొడుకుకి ఆ పేరు పెట్టినట్లు కోటేశ్వరరావు తెలిపారు. తన కుమారుడికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి, అతనిలోని బిడియం పోగొట్టేందుకే హీరోగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. కుమారుడితో వరుసగా మూడు సినిమాలు నిర్మిస్తానని, అందులో అతను తన ప్రతిభ నిరూపించుకోవాలని షరతు పెట్టినట్లు వెల్లడించారు. దర్శకుడు వీరు చెప్పిన కథ, అందులోని ప్రేమకథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టామన్నారు.
సినిమా నిర్మాణ సమయంలో ఇండస్ట్రీలోని వారు ఎంతో సహకరించారని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రవణ్ సంగీతం అందించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఒక పాట పాడారు. కుటుంబ సమేతంగా చూసేలా ‘పురుష:’ సినిమా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు.
