మరోసారి జులై సెంటిమెంట్ ని బయటపెట్టిన రాజమౌళి

Rajamouli-1

కెరీర్ లో తీసిన అన్ని సినిమాలు విజయపధాన నడపడంలో దర్శక ధీరుడు రాజమౌళి నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ పరంగా రాజమౌళి తెరకెక్కించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఘనత టాలీవుడ్ లో మరే ఇతర దర్శకుడికీ లేకపోవడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు దగ్గరపడుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ పై, ట్రైలర్ లపై నెలకొన్న సందేహాలను రాజమౌళి నివృత్తి చేసాడు. అంతేకాక ఈ భారీ చిత్రాన్ని జూలై 10న విడుదలచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ ప్రకటనతో జూలై నెలపై జక్కన్నకున్న సెంటిమెంట్ మరోసారి బయటపడింది.

రాజమౌళి కెరీర్ లో తెరకెక్కించిన సింహాద్రి, మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలు వేర్వేరు సంవత్సరాలలో జులై నెలలోనే విడుదలకావడం గమనార్హం. ఈ చిత్రాలు అఖండ విజయంతో రాజమౌళి కీర్తిని రెట్టింపుచేసాయి. మరి రాజమౌళి తనకి అచ్చొచ్చిన జులై నెలను బాహుబలి విడుదలకు ఎన్నుకోవడం సరైన నిర్ణయమే కదా..

Exit mobile version