అందుకే ‘వారణాసి’ ఐమాక్స్‌లో తీస్తున్నాం – రాజమౌళి

Varanasi

రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సాగే ఈ సాహస గాథను ఐమాక్స్ కోసం చిత్రీకరిస్తున్నారని అభిమానులకు ఇప్పటికే తెలుసు. అయితే, అసలు ఈ ప్రీమియం లార్జ్-ఫార్మాట్‌ను ఎందుకు ఎంచుకున్నారో ఇప్పటివరకు రాజమౌళి ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా ఫ్రెంచ్ పత్రిక ‘త్సౌనామి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని అద్భుతమైన భారీతనమే అందుకు కారణం. ప్రేక్షకులను పూర్తిగా లీనమయ్యేలా చేసే సినిమాటిక్ అనుభూతిని అందించగల ఫార్మాట్‌ ఐమాక్స్.

పైగా రామాయణంలోని భారీ వానర సేనలతో పాటు, దాదాపు 300 అడుగుల (సుమారు 91 మీటర్లు) ఎత్తులో నిటారుగా ఉండే భారీ అంటార్కిటిక్ మంచు నిర్మాణాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఐమాక్స్ యాస్పెక్ట్ రేషియో మాత్రమే, ఆ సన్నివేశాల భారీతనానికి న్యాయం చేయగలదు. అందుకే ఆ ఫార్మాట్ ఎంచుకున్నాం’ అని రాజమౌళి తెలిపారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

Exit mobile version