దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న లేటెస్ట్ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే ఓ వెబ్ పోర్టల్‌తో మాట్లాడిన రాజమౌళి.. ఈ చిత్రం వారణాసి నుండి అంటార్కిటికా, ఆఫ్రికా, అలాగే పురాతన రోమ్ నగరం వరకు ప్రయాణించి, చివరకు మళ్లీ వారణాసిలోనే ముగుస్తుందని తెలిపారు. 2022లో ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయినప్పటి నుండి దాదాపు నాలుగేళ్లన్నరగా ఈ కథపై పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ముఖ్యమైన భారీ యాక్షన్ సీన్లన్నీ పూర్తయి కేవలం చిన్న సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్న తొలి నాన్-ఇంగ్లీష్ సినిమా ‘వారణాసి’ అని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పునఃప్రారంభం కాగా, దసరా పండుగ నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ మరియు పౌరాణికాంశాల సమ్మేళనంగా తెరకెక్కుతోంది. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారతదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
