
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక వాయిదా పడిన విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్‌లో మే 31న అభిమానుల సమక్షంలో ఈ వేడుకను ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్నారు. అయితే ఆడియో వేడుకను నిర్వహించే విషయంలో పోలీసులు కొన్ని పరమితులు విధించడంతో ఆడియో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇదే విషయమై దర్శకుడు రాజమౌళి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలిపారు.
ఈ సమావేశంలో సినిమా గురించి అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలిచ్చారు. బాహుబలి సినిమాకు మొదటి వారాంతం టికెట్ ధర పెంచనున్నారని వినిపించింది. ఇది ఎంత వరకు నిజం? అన్న ఓ ప్రశ్నకు, “ఇలాంటి పుకార్లు ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో నాకర్థం కాదు. మా సినిమాకు టికెట్ ధరను పెంచే ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇది కేవలం ఎవరో అల్లిన గాలి వార్త మాత్రమే!” అని క్లారిటీ ఇచ్చారు. కొత్త ఆడియో రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్‌లకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.