
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు ఇది కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు. మరో తొమ్మిది రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకా సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. ఓ పక్క ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయాలి. మరో పక్క దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ రెండు పనులతో రాజమౌళి బిజీబిజీగా గడిపేస్తున్నారు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టేయగా, రాజమౌళి గత రెండు రోజుల నుంచి నేరుగా తానే ప్రచారంలోకి దిగారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయానికి వస్తే.. ప్రస్తుతం ముంబైలో రీ-రికార్డింగ్ పనులు జరుగుతుండగా, హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో డీఐ పనులు జరుగుతున్నాయి. త్వరత్వరగా ఈ పనులన్నింటినీ పూర్తి చేసి రిలీజ్ డేట్‌కి కొన్ని రోజుల ముందే సినిమాను పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!