దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ కి స్వల్ప విరామం ప్రకటించారు. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ థియేటర్లో బాహుబలి ప్రదర్శన ఈనెల 19న జరిగింది. ఈ అరుదైన ప్రదర్శన కొరకు బాహుబలి చిత్ర యూనిట్ అయిన ప్రభాస్, అనుష్క, రానా నిర్మాత శోబు యార్లగడ్డలతో కలిసి రాజమౌళి లండన్ వెళ్లడం జరిగింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగుకి తాత్కాలిక బ్రేక్ పడడం జరిగింది. కాగా ఈకార్యక్రమం ముగించుకొని ఇండియా చేరిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సన్నద్దమయ్యారని తెలుస్తుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక పోరాట సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం. విడుదల తేదీ దగ్గిర పడుతున్న క్రమంలో రాజమౌళి ఇకపై నిరవధికంగా షూటింగ్ జరపాలని నిర్ణయించుకున్నారట. అలాగే చరణ్, తారక్ లు కూడా అందుబాటులో ఉండాలని అల్టిమేటం జారీ చేశారని సమాచారం. అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.
