
రాజమౌళి అంటే ఇండియన్ సినిమా మార్కెట్‌ను, టెక్నికల్ స్టాండర్డ్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు. ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాలతో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ సినిమాకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన రాజమౌళి, ఈ సినిమాలనే తన ఐడెంటిటీగా చేసుకొని టాప్ దర్శకుల్లో ఒకరుగా చేరిపోయారు. ఇక ఈ మధ్యే విడుదలైన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దర్శక ధీరుడు తాజాగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ అందరి మన్ననలూ పొందుతూ క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు.
బాహుబలి సినిమా టోరంటో, భుసాన్ లాంటి పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ కొరియాలోను టొరంటోలో జరుగుతోన్న భుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాహుబలి సినిమాను ప్రదర్శిస్తున్నారు. అక్టోబర్ 4, 7 9వ తేదీల్లో భుసాన్ ఫెస్టివల్‌లో ఓపెన్ సినిమా క్యాటగిరీలో ప్రదర్శించేందుకు బాహుబలి సినిమాను ఎంపిక చేశారు. ఇక 4వ తేదీ జరిగిన ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళి హాజరై అక్కడి ప్రేక్షకులతో సరదాగా ముచ్చటించారు.
ఇక ఈ ప్రదర్శన తర్వాత రాజమౌళిని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు, ‘ఈగ’ సినిమా దర్శకుడే ఇప్పుడీ ‘బాహుబలి’ సినిమాకూ దర్శకత్వం వహించారంటూ పరిచయం చేశారట. ఇక ఇప్పటికే ఈగ సినిమాతో రాజమౌళికి ఫ్యాన్స్‌గా మారిపోయిన సౌత్ కొరియన్ సినీ అభిమానులు రాజమౌళి ఆటోగ్రాఫ్ కోసం ఆసక్తి కనబరిచారు. ఈగ డీవీడీలపై రాజమౌళి ఆటోగ్రాఫ్ తీసుకొని సౌత్ కొరియన్ ఫ్యాన్స్ సందడి చేశారు. ఇక ఈ విషయం గురించే తెలియజేస్తూ.. ఈగ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఇక ఒక ప్రాంతీయ సినిమా దర్శకుడు ఇలా ప్రపంచ సినీ వేదికలపై క్రేజ్ సంపాదించుకోవడం రాజమౌళి ఘనతగానే చెప్పుకోవచ్చు.