రాజకీయాల్లోకి రాకూడదనే రజినీ నిర్ణయం సరైనదే అనుకోవాలి


గత కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపుతూ వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశానికో ఈరోజుతో శాశ్వతంగా తెరపడింది. రజినీ తాను రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రకటించేశారు. దీంతో అభిమానుల ఆశల్నీ అడియాశలయ్యాయి. డిసెంబర్ 31న పార్టీని ప్రకటిస్తారని అనుకుంటుంటే ఇలా చేశారేమిటని చాలామంది నిరుత్సాహపడ్డారు. మొదట్లో విమర్శలు కూడ చేశారు. కానీ కాస్త కుదుటపడి రజినీ పరిస్థితిని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని రజినీని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు అభిమానులు.

వారి కోరిక మేరకు అనేక పర్యాయాల చర్చలు, ఆలోచనల తర్వాత ఈ నెల 31న [పార్టీని ప్రకటించడానికి రెడీ అయ్యారు సూపర్ స్టార్. కానీ ఆయనకు గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగి ఉండటం, బయట కోవిడ్ ప్రభావం ఇంకా అలాగే ఉండటంతో ఆరోగ్యం దృష్ట్యా రజినీ రాజకీయాల్లోకి రావడం జరిగేపనేనా అనే అనుమానం అందరిలోనూ ఉంటూ వచ్చింది. మొదటి నుండి రజినీ కుటుంబ సభ్యులకు కూడ ఆయన ఈ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లడం పెద్దగా ఇష్టం లేదు. దానితోడు తాజాగా ‘అన్నాత్తే’ షూటింగ్లో ఉండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువ సమయం షూటింగ్ చేయడం వలనే రక్తపోటుతో తేడా వచ్చి అస్వస్థత చెందారు. ఈ పరిణామం ఆయన కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. కోలుకుని ఇంటికి వెళ్లిన రజినీని కుటుంబ సభ్యులు ఇలాంటి స్థితిలో రాజకీయాల్లోకి వెళ్లడం మంచిది కాదని నిర్ణయం మార్చుకోమని కోరారు.

బాగా ఆలోచించిన రజినీ కుటుంబ సభ్యుల నిర్ణయానికి అంగీకారం తెలిపి పార్టీ పెట్టడంలేదని ప్రకటించారు. ప్రస్తుతం రజినీ వయసు 70 ఏళ్ళు. గతంలో తలెత్తిన అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు విశ్రాంతి , ప్రశాంతత చాలా అవసరమని వైద్యులే అన్నారు. ఇక రాజకీయాలంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. పనిభారం, మానసిక, శారీరక ఒత్తిడి విపరీతం. ఎన్ని గంటలు పనిచేసినా ఇంకా పని మిగిలే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పలేం. ఎదగడానికి ఎంతో సమయాన్ని, కష్టాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అదే కిందకి పడిపోవడం రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. ఉన్నట్టుండి ఎదురయ్యే సంక్షోభాలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇంత పెద్ద వయసులో ఈ కష్టాలు, కంగారు రజినీకి అంత మంచిది కాదనే అనాలి. కాబట్టి రాజకీయ రంగప్రవేశం నుండి ఆయన విరమించుకోవడం మంచి నిర్ణయమనే. కనుక ఈ విషయంలో ఎక్కువగా నిరుత్సాహపడకుండా ఎప్పటిలాగే వెండితెర మీద రజినీని ఆస్వాదిద్దాం అందరం.

Exit mobile version