
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో యువ హీరో రామ్ స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ రామ్ ను నామినేట్ చేశారు. జెపి సవాల్ ను స్వీకరించిన రామ్ హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడాలోని ఒక ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను అభిమానులతో శుభ్రం చేశారు. అనంతరం రామ్ మాట్లాడుతూ.. 100 కోట్ల మంది భారతీయులు గంట పాటు శ్రమిస్తే మన దేశాన్ని శుభ్రంగా మార్చవచ్చని అన్నారు.
అనంతరం ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్లకు రామ్ సవాల్ విసిరారు. వెంటనే స్పందించిన ఇద్దరు అందాల భామలు సవాల్ ను స్వీకరించారు. సమంత, హన్సిక, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లను స్వచ్చ భారత్ కార్యక్రమంలో పోల్గోనవలసిందిగా నామినేట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. సమంత, హన్సిక రామ్ సవాల్ ను స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.