మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీనువైట్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు ఈ సినిమాకు రచయితలుగా పనిచేస్తున్నారు. డీవీవీ దానయ్య చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మధ్యే ఇటలీ, స్పెయిన్‌లలోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్య రెండు పాటలను చిత్రీకరించారు.
యూరప్ షెడ్యూల్‌లో చిత్రీకరించిన ఈ రెండు పాటలు చాలా అందంగా వచ్చాయని సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ తిరిగి హైద్రాబాద్ వచ్చేసింది. ఇక తాజా షెడ్యూల్ హైద్రాబాద్‌లో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
