చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనతికాలంలోనే మెగా పవర్ స్టార్ బిరుదుతో రామ్ చరణ్ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ అనే సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ హీరోగా ఓ రెండు సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇక అదేవిధంగా నిర్మాతగానూ ఓ కొత్త రోల్ పోషించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు రామ్ చరణ్ తెలియజేశారు.
కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ అనే సంస్థపై పలు పెద్ద సినిమాలను నిర్మించనున్న రామ్ చరణ్, ఈ బ్యానర్‌తో పాటు వైట్ హార్స్ ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్లో చిన్న సినిమాలను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై మొదటి సినిమాగా చిరు 150వ సినిమా రూపొందనుంది. ఇక వైట్ హార్స్ బ్యానర్‌పై సరికొత్త కథాంశాలతో రూపొందే ఇన్నొవేటివ్ చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. ఈ బ్యానర్ కోసం ఓ టీమ్‌ను సిద్ధం చేస్తున్నానని, త్వరలోనే ఆ టీమ్‌తో కలిసి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. కొత్త తరాన్ని, ఆలోచనలను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ బ్యానర్ పనిచేస్తుందని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
