
ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటించిన ‘పండగ చేస్కో’ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ‘శివం’, ‘హరికథ’ అనే రెండు సినిమాల షూటింగ్‌తో జోరుమీదున్నాడు రామ్. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా సొంత సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ ఈ రెండు సినిమాలను చేస్తూ ఉండడం విశేషం. ‘శివం’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు కాగా, ‘హరికథ’ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని రామ్ పుట్టినరోజైన మే 15న అభిమానులకు అందించాలని స్రవంతి మూవీస్ ప్లాన్ చేస్తోందట. ఇదే విషయంపై రామ్ స్పందిస్తూ..”మే 15న శివం, హరికథలకు సంబంధించి స్రవంతీ మూవీస్ ఒక సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేస్తోంది” అంటూ ట్వీట్ చేశారు. ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందని అభిమానులు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. పై రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయన్నది ఎక్కువగా వినిపిస్తోన్న కామెంట్. మరి ఆ సర్‌ప్రైజ్ ఏంటన్నది సరిగ్గా తెలియాలంటే మే 15 దాకా ఆగాల్సిందే!