‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ఆయన పాట లేపేశారా..?

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ స్టామినాను మరోసారి నిరూపిస్తూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఈ సక్సెస్ జోష్‌తో ఉన్న అనిల్ రావిపూడి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్రంలోని ఒక పాట తొలగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు మీద’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే సెంటిమెంట్‌తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రమణ గోగులతో ఒక పాట పాడించారు. అయితే, ఆ పాట ఎంతో మెలోడియస్‌గా వచ్చినప్పటికీ, సినిమా ఫ్లో ప్రకారం ఆ సందర్భంలో ఒక ఎనర్జిటిక్ మరియు పెప్పీ నంబర్ అవసరమని అనిల్ భావించారు.

దీంతో ఆ మెలోడీ పాటను తొలగించి, దాని స్థానంలో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను చేర్చినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇదే విషయాన్ని రమణ గోగులకు వివరించానని, ప్రస్తుతం ఈ పాటను విడిగా కూడా విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ అద్భుతమైన మెలోడీని వృధా చేయకుండా తన రాబోయే చిత్రాల్లో ఎక్కడో ఒకచోట ఉపయోగిస్తానని అనిల్ రావిపూడి హామీ ఇచ్చారు.

Exit mobile version