
టాలీవుడ్‌లో ఆరడుగులకు పైనే పొడవు, అందుకు తగ్గట్టుగానే కండపుష్టి కలిగిన హీరోల్లో రానా మొదటి స్థానంలో ఉంటారు. తన ఫిజిక్, యాక్టింగ్‌తో ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతటికీ పరిచయస్థుడైపోయారు రానా. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’లో రానా విలన్‌గా నటించిన విషయం తెలిసిందే! భారీ అంచనాల మధ్య జూలై 10న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తన గత చిత్రాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పరిచయస్థుడైన రానా, ‘బాహుబలి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆ సినిమా విడుదలయ్యాక రానా రేంజ్ ఎక్కడికి వెళుతుందనేది అటుంచితే సోషల్ మీడియాలో తెలుగు హీరోల్లో రానా ఇప్పటికే దూసుకుపోతున్నారు. ట్విట్టర్‌లో రానా ఫాలోవర్స్ సంఖ్య నేటితో 1 మిలియన్ (పది లక్షలు)కు చేరింది. సిద్ధార్థ్, మహేష్ బాబు, నాగార్జున తర్వాత తెలుగు హీరోల్లో 1 మిలియన్ మార్క్ అందుకుందీ రానాయే కావడం విశేషం. ఇక తెలుగు దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళిలు మాత్రమే 1 మిలియన్ మార్క్ దాటిన వారిలో ఉన్నారు.

