బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా ‘డాన్-3’ కోసం రణ్‌వీర్ స్టెప్..!

బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా ‘డాన్-3’ కోసం రణ్‌వీర్ స్టెప్..!

Published on Apr 22, 2026 11:00 PM IST

Don-3

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ధురంధర్’ వంటి భారీ విజయం తర్వాత తన ఇమేజ్‌కు తగ్గ కథలనే ఎంచుకోవాలని భావిస్తున్న రణ్‌వీర్, అనూహ్యంగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘డాన్-3’ నుండి తప్పుకున్నాడు. సినిమా కోసం అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో రణ్‌వీర్ వైదొలగడం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బగా మారింది.

ఈ పరిస్థితిని గమనించిన రణ్‌వీర్, తన వల్ల జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తూ నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు రూ. 10 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చాడు. అయితే ఈ మొత్తాన్ని నేరుగా ఇవ్వకుండా, తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’ ప్రాజెక్టులో ఫర్హాన్‌ను వాటాదారుగా చేర్చడం విశేషం. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ జాంబీ థ్రిల్లర్ లాభాల్లో ఫర్హాన్‌కు వాటా దక్కేలా రణ్వీర్ ఈ డీల్ కుదుర్చుకున్నాడు.

ఇక రణ్‌వీర్ స్థానంలో ‘డాన్-3’ ప్రాజెక్టులోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హీరోలు అగ్రిమెంట్ల నుండి తప్పుకుంటే నిర్మాతలు నష్టపోవడం చూస్తుంటాం, కానీ రణ్‌వీర్ ఇలా బాధ్యతాయుతంగా పరిహారం చెల్లించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

తాజా వార్తలు