వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా తెలుగు చిత్రం ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సత్యదేవ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. పలు అంతర్జాతీయ నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ చిత్రాన్ని వీక్షించి, దీనిపై తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం. గతంలో ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన వెంకటేష్ మహా, ఈ సినిమాను తొలుత కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రమోట్ చేయాలని భావించాడు. కానీ అప్పట్లో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో కుదరలేదు. ఇప్పుడు సినిమాకు వస్తున్న అంతర్జాతీయ గుర్తింపుతో మేకర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
పలు ఫారిన్ ప్రొడక్షన్ హౌసెస్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ భాషల్లో రీమేక్ చేయాలా లేక డబ్ చేసి విడుదల చేయాలా అనే ఊగిసలాటలో ఉన్నారట. గ్లోబల్ మార్కెట్లో తెలుగు సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా డబ్బింగ్ మంచి ఆప్షన్ అయినప్పటికీ, పెద్ద స్టూడియోలు రంగంలోకి దిగితే ఇంటర్నేషనల్ కాస్టింగ్‌తో రీమేక్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి రావు బహదూర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.
