సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రాషా తడాని తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
‘శ్రీనివాస మంగాపురం’ కథను ఎప్పుడు విన్నారు?
గత ఏడాది జూలైలో అజయ్ భూపతి గారు ఈ కథ చెప్పారు. ఆయన పాత్రలను తీర్చిదిద్దిన తీరు, అందులోని లవ్ అండ్ ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయి. కథ వింటున్నప్పుడే ఆయన ఆ క్యారెక్టర్లను ఎంతగా ప్రేమించారో అర్థమైంది. ఆ ఎమోషన్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను, ఇదొక వండర్‌ఫుల్ స్టోరీ.
మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నాది ‘మంగా’ అనే పాత్ర. ఇందులో నాకు రెండు విభిన్న కోణాలు (షేడ్స్) ఉంటాయి; ఒకవైపు చాలా బబ్లీగా, మరోవైపు చాలా పద్ధతిగా, హుందాగా కనిపిస్తాను. నాకు తెలుగు అర్థమవుతుంది కానీ స్పష్టంగా మాట్లాడలేను. అందుకే డైరెక్టర్ అజయ్ భూపతి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి డైలాగ్, ఎమోషన్‌ను నాకు దగ్గరుండి నేర్పించారు. ఈ పాత్ర నా రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది.
జయకృష్ణ ఘట్టమనేనితో పని చేయడం ఎలా అనిపించింది?
జయకృష్ణ చాలా స్వీట్ అండ్ కూల్ పర్సన్. సెట్‌లో ఆయన చాలా సరదాగా ఉంటారు. షూటింగ్ సమయంలో మేమిద్దరం కలిసి వర్క్ చేయడం చాలా ఫన్‌గా అనిపించింది.
మోహన్ బాబు గారితో పని చేయడం ఎలా అనిపించింది?
మా అమ్మగారు కూడా మోహన్ బాబు గారితో వర్క్ చేశారు. ఆయనతో పని చేయడం చాలా సరదాగా అనిపించింది. సెట్‌లో ఎప్పుడూ జోకులు వేస్తూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకున్న అనుభవం నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
వైజయంతి మూవీస్ ద్వారా తెలుగులో రావడం ఎలా అనిపించింది?
వైజయంతి మూవీస్ ఎంతో మంది స్టార్స్‌ను పరిచయం చేసిన ప్రతిష్టాత్మక సంస్థ. నా లైఫ్‌లో కలిసిన బెస్ట్ పర్సన్స్‌లో అశ్విని దత్ గారు ఒకరు; ఆయన నన్ను ఒక మనవరాలిలా చూసుకున్నారు. మా తాతగారితో కూడా ఆయనకు మంచి పరిచయం ఉంది. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఆయన ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్ ఉంటారు.
తెలుగు సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు ఏమన్నారు?
తెలుగు ఇండస్ట్రీలో చాలా హెల్తీ, హ్యాపీ వాతావరణం ఉంటుందని, ఇక్కడి షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్ చాలా ఫన్‌గా ఉంటుందని అమ్మ చెప్పారు. అలాగే నన్ను తెలుగు భాష నేర్చుకోమన్నారు. ఆమె చెప్పినట్లే ప్రస్తుతం నేను తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను.
తిరుపతిలో షూటింగ్ గురించి?
నా తొలి తెలుగు సినిమా షూటింగ్ తిరుపతిలో జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఆ దేవుడితో పాటు ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
