బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్‌కు ముంబైలో ఒక ఊహించని అనుభవం ఎదురైంది. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘ఓ మై డాగ్’ సినిమా ప్రత్యేక ప్రదర్శన (స్పెషల్ స్క్రీనింగ్) కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ ఈవెంట్లో దర్శకుడు అమిత్ రాయ్, నిర్మాత రమేష్ తౌరానీ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈవెంట్ సందర్భంగా పసుపు రంగు డ్రెస్‌లో మెరిసిన రవీనా టాండన్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అక్కడ ఉన్న ఒక పెంపుడు కుక్క దగ్గర కూర్చుని దాన్ని ప్యాంపర్ చేస్తూ ఫొటోగ్రాఫర్లకు నవ్వుతూ పోజులిచ్చారు. అయితే, రవీనా నిలబడగానే పక్కనే ఉన్న మరొక కుక్కను చూసి ఆ కుక్క ఒక్కసారిగా బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. ఆ క్రమంలో రవీనా డ్రెస్ స్లీవ్కి ఉన్న దారం ఆ కుక్క పళ్లలో చిక్కుకోవడంతో, అది డ్రెస్‌ను గట్టిగా లాగడం మొదలుపెట్టింది.
ఒక్కసారిగా వాతావరణం మారినప్పటికీ, రవీనా టాండన్ ఏమాత్రం భయపడలేదు. కుక్కను తోసేయడం గానీ, కంగారుగా కేకలు వేయడం గానీ చేయకుండా ప్రశాంతంగా నిలబడ్డారు. అక్కడే ఉన్న డాగ్ హ్యాండ్లర్లు వెంటనే స్పందించి కుక్కను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రవీనా మళ్లీ ఆ కుక్క దగ్గరకు వెళ్లి దాని తలపై నిమిరి సరదాగా గడిపారు.
ఈ ఘటన తర్వాత తనకు ఏమైనా గాయమైందా అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని రవీనా స్పష్టం చేశారు. మరొక కుక్కను చూడటంతోనే అది భయపడి అలా ప్రవర్తించిందని, తన డ్రెస్ దారం దాని పళ్లలో చిక్కుకోవడంతో చిన్న గందరగోళం జరిగిందని ఆమె వివరించారు. సమయస్ఫూర్తితో పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న రవీనా టాండన్ ధైర్యాన్ని నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
