
అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించగా నీరజ్‌పాండే దర్శకత్వంలో రూపొందిన సినిమా .. ‘స్పెషల్ 26’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాక, నీరజ్ పాండే స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ సినిమాని ఇతర భాషల్లోకి తెరకెక్కించే కార్యక్రమం జరుగుతోంది. స్పెషల్ 26 సినిమా నాలుగు భాషల రీమేక్ (తెలుగు, తమిళం, కన్నడ, మళయాల..) హక్కులను ప్రముఖ దర్శక నటుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలని నిర్మించే పనిలో ఆయన ఉన్నారు.
తాజా సమాచారం మేరకు తెలుగు రీమేక్‌లో రవితేజను నటింపజేయనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఈ సినిమా రీమేక్ పట్ల ఎప్పట్నుంచో సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అనుపర్ ఖేర్ పాత్రలో వెంకటేష్ నటించనున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.. మరి ఇప్పుడు ఆ పాత్ర ఎవరు పోషిస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. ‘స్పెషల్ 26’ తెలుగు రీమేక్‌లో రవితేజ సరసన త్రిషను సెలెక్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇంతకుముందు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ’ సినిమాలో జత కట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని కొన్ని మార్పులతో స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.