సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా

సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా

Published on Aug 21, 2026 6:01 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 21, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు.
దర్శకత్వం : శివ నిర్వాణ
సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఛాయాగ్రహణం : విష్ణు శర్మ
కూర్పు : ప్రవీణ్ పూడి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :-

త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)లతో ఎంతో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఐతే, త్రినాథ్ మందు తాగకుండా ఉండలేడు. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే తాగుడికి దూరంగా ఉంటాడు. మరోవైపు ఊరిలోని ప్రతి అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైస్కూల్ లో చదివే ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది?, ఆమె ఫ్రెండ్ గాయత్రి పడిన ఇబ్బందులు మణికంఠ (బేబీ నక్షత్ర)కు ఎలా తెలిశాయి ?, అసలు మందుకు బానిసైన త్రినాథ్.. మళ్లీ తాగను అని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు ?, చివరకు స్కూల్ లో జరుగుతున్న సంఘటనలు ఏమిటి ?, ఆ అన్యాయాలను త్రినాథ్ ఎలా అడ్డుకున్నాడు ?, తన కూతురి కోసం ఒక తండ్రిగా త్రినాథ్ ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ‘యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో ఈ సినిమా సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో రవితేజ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

ప్రియా భవానీ శంకర్.. భార్య పాత్రలో చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ఎమోషనల్ సీన్ లో ఆమె నటన చాలా బాగుంది. స్వసికా విజయ్ ఆకట్టుకుంది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన సాయికుమార్, అజయ్ ఘోష్ బాగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే తండ్రి – కూతురి మధ్య ఎమోషనల్ కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్‌. ఆ సన్నివేశాల్లో రవితేజ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. పైగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

మైనస్ పాయింట్స్ :

బరువైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ ‘యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక సాయి కుమార్ – ఎమ్మెల్యే పాత్రల మధ్య వచ్చే ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శివ నిర్వాణ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

‘ఇరుముడి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. ఐతే, రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు