
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్ళిద్దరు కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయన్నది ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ సినిమాలతో ఇప్పటికే చూపెట్టేశారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నిన్నే పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు. “మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్. మహేష్‌తో నేను చేయనున్న హ్యాట్రిక్ సినిమాకు సిద్ధం కండి” అంటూ మహేష్ అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపారు పూరీ.
పూరీ జగన్నాథ్ ప్రకటనతో ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్న మహేష్ అభిమానులు, ఈ సినిమా విషయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్స్‌తో మరింత ఆనందంలో మునిగిపోయారు. “మహేష్ కోసం పూరీ తయారు చేసిన కథ విన్నా. పోకిరి, బిజినెస్‌మేన్, దూకుడు సినిమాలు ఆ కథ ముందు చాలా చిన్న విషయాలు. మహేష్ కెరీర్లే ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ లేనంత బలమైన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉంది” అంటూ మహేష్-పూరీల సినిమా కథపై ప్రశంసల వర్షం కురిపించారు వర్మ. ఈ ట్వీట్లతో సినిమా అనౌన్స్ కూడా కాకముందే అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయ్!
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కే బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలుపెట్టనున్నారు మహేష్. ఈ రెండు సినిమాల తర్వాత పూరీ-మహేష్‌ల కాంబినేషన్ సెట్స్‌పైక్ వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లోపు చిరంజీవి 150వ సినిమాను ఫినిష్ చేయనున్నారు పూరీ జగన్నాథ్.