
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కిల్లింగ్ వీరప్పన్ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేయగా తాజాగా విడుదలైన ఆడియో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మొదటి కన్నడ సినిమా కావడం కూడా కిల్లింగ్ వీరప్పన్‌కు ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. నవంబర్ 2న బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్, యాష్ తదితరులు పాల్గొనగా పెద్ద ఎత్తున ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. రామ్ గోపాల్ వర్మ ఒక కన్నడ సినిమాను ఈ స్థాయిలో తెరకెక్కించడం సంతోషంగా ఉందని ఆడియో లాంచ్‌కు విచ్చేసిన అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్పాట్, హయ్యా అనే పాటలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. కన్నడ భాషలో ప్రధానంగా చిత్రీకరించబడిన ఈ సినిమా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం లాంటి ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. నవంబర్ 20న ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.