ఆ మాటలు విని కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఎమోషనల్ అయిన హీరో రామ్ కిరణ్

2

ప్రముఖ కొరియోగ్రాఫర్ రామ్ కిరణ్ హీరోగా పరిచయమవుతూ, మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి పతాకంపై ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ కిరణ్ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

“ఇటీవల కొందరు కుటుంబాలకు ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించాం. సినిమా చూశాక వారు చెప్పిన మాటలు, వారి స్పందన చూసి ఆనందంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కుటుంబ విలువలని ప్రతిబింబించే చిత్రమిది,” అని రామ్ కిరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. బెంగళూరులో పెరిగిన తనకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్, నటనపై మక్కువ ఉండేదని, హీరోగా తన తొలి చిత్రంలోనే సైకలాజికల్ కోణం ఉన్న వైవిధ్యమైన పాత్ర దక్కడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. హీరోయిన్ మేఘా ఆకాష్ స్టార్ హీరోలతో చేసినప్పటికీ ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వమని కొనియాడారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కొరియోగ్రఫీ చేస్తూనే, వైవిధ్యమైన పాత్రలు, ముఖ్యంగా విలన్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రామ్ కిరణ్ వెల్లడించారు.

Exit mobile version