మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. బైక్ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోవడానికి, శారీరకంగా సిద్ధమవ్వడానికి ఆయన సమయం తీసుకున్నాడు. తాజాగా ‘విరూపాక్ష’ విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, తేజ్ తన తదుపరి ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం కోసం తేజ్ ఎంతో శ్రమ చేస్తున్నాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తర్వాతే తన మిగిలిన ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని తేజ్ నిర్ణయించుకున్నాడు.
ఇక ఫ్యాన్స్‌ను ఊరించే మరో విషయం ఏంటంటే.. తేజ్ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. సుజిత్ – సందీప్ దర్శకత్వంలో తేజ్ ఒక సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటు మరో రెండు కొత్త సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ‘సంబరాల ఏటి గట్టు’ విడుదల తర్వాత వరుసగా ఈ కొత్త చిత్రాల అధికారిక ప్రకటనలు రానున్నాయి. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తేజ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నాడు.


