సాయి సోహన్, విస్మయ శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్లోని ఆరె మైసమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిసా ఎంటర్టైన్మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా తమ మూడో ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జి.మధుసూధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రైమ్ కామెడీ నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నిశాంక్ రెడ్డి, మహేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
